గ్రూప్-4 దరఖాస్తులు 5లక్షలు
- ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
- గ్రూప్-2కు తొలిరోజే 15,405 దరఖాస్తులు
- 15 నోటిఫికేషన్లకు 12.29 లక్షల దరఖాస్తులు
- 12,507 ఉద్యోగాలు, 13,30,475 మంది
- ఒక్కో పోస్టుకు సగటున 98 మంది పోటీ
- డీఏవో పోస్టులకు అత్యధికంగా దరఖాస్తులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది.నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి,13 క్యాటగిరీల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించింది.గ్రూప్-2, 4 ఉద్యోగాలకు అప్లికేషన్ల ప్రక్రియ నడుస్తున్నది.మరో 11 క్యాటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్నది.15 క్యాటగిరీల్లో 12,507 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా,ఇప్పటి వరకు 12,29,391 మంది దరఖాస్తులు సమర్పించారు. అంటే ఒక్కో ఉద్యోగానికి 98 మంది పోటీపడుతున్నట్టు లెక్క.అన్నింట్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ఉద్యోగాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.53 ఉద్యోగాలకు 1,06,263 మంది దరఖాస్తు చేశారు.ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీపడుతున్నారు.ఆ తర్వాత 23 మహిళ,శిశు సంక్షేమాధికారి ఉద్యోగాలకు 19,814 మంది దరఖాస్తు చేశారు.అత్యల్పంగా ములుగు ఫారెస్ట్ కాలేజీలో 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు కేవలం 188 అప్లికేషన్లు వచ్చాయి.
గ్రూప్-4 కు దరఖాస్తుల వెల్లువ
టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్లలో 503 గ్రూప్-1 ఉద్యోగాలకు 3,80,204 మంది దరఖాస్తు చేశారు.ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా,మెయిన్ జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.గత నెల 30న ప్రారంభమైన గ్రూప్-4 ఉద్యోగాలకు బుధవారం సాయంత్రం వరకు 4,97,056 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల19వ తేదీతో గడువు ముగియనుండగా,దరఖాస్తులు భారీగా వస్తుండటంతో 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.దీని ప్రకారం ఇప్పటి వరకు కేవలం గ్రూప్-1,2,4 ఉద్యోగాల కోసమే 8,92,665 మంది దరఖాస్తు చేశారు.గ్రూప్-2లో 783 దరఖాస్తు ప్రక్రియ బుధవారమే ప్రారంభమైంది. మొదటిరోజే, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 15,405 దరఖాస్తులు వచ్చాయి.గ్రూప్-3లో 1,365 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.