8 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న టీచర్లు కదలాల్సిందే
* ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న హెచ్‌ఎంలకూ స్థానచలనమే
* నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు
* నేడు ఖాళీలు,సీనియారిటీ జాబితా రేపట్నించి దరఖాస్తులు
* ఒకేచోట 2 ఏళ్లు మించి ఉన్నోళ్లు అర్హులు
హైదరాబాద్ : ఎనిమిదేళ్లుగా కదలకుండా ఒకే పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న టీచర్లకు,ఐదేళ్లుగా ఒకే పాఠశాలకు పరిమితమైన హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఒకేచోట కనీసం రెండేళ్లు పనిచేసిన టీచర్లను మాత్రమే బదిలీకి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నేటి నుంచి టీచర్ల పదోన్నతులు,బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబరు 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు,మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి.నేడు కేటగిరీల వారీగా ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.
28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఈవోలకు.మండల పరిషత్ ప్రాథమిక,ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాల్సి ఉంది.మొత్తం ప్రక్రియ 37 రోజులపాటు జరగనుండగా బదిలీలు,పదోన్నతులపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు ఇచ్చారు.
ఫిబ్రవరి-1 నాటికి ఒకే పాఠశాలలో వరుసగా ఐదేళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి.ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన టీచర్లనూ తప్పనిసరిగా బదిలీ చేయాలి.మూడేళ్లలో పదవీ విరమణ పొందేవారికి మినహాయింపు ఉంటుంది.బాలికల పాఠశాలల్లో 50 ఏళ్ల లోపున్న ప్రధానోపాధ్యాయులను(పురుషులు) తప్పనిసరిగా బదిలీ చేయాలి.ఇక్కడ మహిళా హెచ్‌ఎంలను నియమించాలి.ఒకవేళ అర్హత కలిగిన మహిళలు లేకుంటే 50 ఏళ్లు పైబడిన పురుషులను నియమించవచ్చు.ఎన్‌సీసీ ఆఫీసర్లుగా ఉండి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు,ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లను ఎన్‌సీసీ ఉన్న పాఠశాలలకు బదిలీ చేయాలి.
70 శాతానికి పైగా అంగవైకల్యం కలిగిన టీచర్లు,వితంతువులు,విడాకులు పొంది పునర్వివాహం చేసుకోని మహిళలకు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యంఇవ్వాలి.అలాగే ప్రధానోపాధ్యాయులు/టీచర్ల జీవిత భాగస్వాములు,క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ,న్యూరో సర్జరీ,బోన్ టీబీ,కిడ్నీ డయాలసిస్,కిడ్నీ/లివర్/హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుని ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. అలాగే మానసిక సమస్యలు,లుకేమియా,తలసేమియా,గుండెలో రంధ్రం ఉన్న పిల్లల తల్లిదండ్రులైన టీచర్లకు కూడా సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యంఇస్తారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా,అదనపు కలెక్టర్ ఉపాధ్యక్షుడిగా,జడ్పీ సీఈవో సభ్యుడు, జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.అలాగే, జిల్లా పరిషత్,ఎంపీపీ పాఠశాలల ఉపాధ్యాయులకు జడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షుడిగా,కలెక్టర్ ఉపాధ్యక్షుడిగా,అదనపు కలెక్టర్,జడ్పీ సీఈవో సభ్యులుగా,జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.బదిలీలకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్నాక ఎలాంటి మార్పులు,చేర్పులకు అవకాశం ఉండదు.
బదిలీలకు ఒకేచోట కనీస సర్వీసుకాలం రెండేళ్లుగా మార్గర్శకాల్లో ప్రకటించారు.ఈ లెక్కన రెండేళ్లకు మించిఒకచోట ఉన్న టీచర్లే దరఖాస్తులకు అర్హులు.అయితే, తేడాది కొత్త జిల్లాల్లోని పాఠశాలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీవో-317 ప్రకారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మందిని బదిలీ చేసింది.తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్నామని ప్రభుత్వం పేర్కొంది.అయితే కనీస సర్వీసు రెండేళ్లు నిర్ణయించడంతో వీరంతా తాజాగా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.తాత్కాలిక ప్రాతిపదికన బదిలీచేసి తమను అనర్హులుగా ప్రకటించడం సరికాదని,కనీస సర్వీసు నిబంధన లేకుండా అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.వీరికీ అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాకు డిమాండ్ చేశాయి.