అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మఠంపల్లి : అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బాడవతండా పంచాయతీ పరిధిలోని మామిడిచెట్టుతండాలో చోటుచేసుకుంది.బంధువులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శీత్లాతండా(సోమ్లాతండా)కు చెందిన బానోతు శాంతి(31)కి 13 ఏళ్ల కిందట మామిడిచెట్టుతండాకు చెందిన శ్రీరాములతో వివాహమైంది.వారికి 12 ఏళ్ల బాబు శివనందం ఉన్నాడు.శాంతి ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం 7వ వార్డు మెంబరుగా కొనసాగుతోంది.మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుంది.శాంతి కోసం ఇంటికి వెళ్లిన ఇరుగుపొరుగు చూసేసరికి అప్పటికే మృతి చెందింది.శాంతి మృతికి కారణాలు తెలియదని,తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపారు.
నెలాఖరుకు పార్లమెంట్ నూతన భవనం సిద్ధం
న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి.రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టాలో భాగమే పార్లమెంట్ కొత్త భవనం.రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్ మధ్యలోని మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్ నవీకరణ,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని కొత్త కార్యాలయం,నివాసంఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది.
నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది ఆమె చెతిలోనే ఉంది
కొమురంభీం : తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధినేత్రి మాయావతి,రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు.ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై ద్రుష్టి పెట్టామన్నారు. బీఎస్పీ బలమైన శక్తిగా అవతరిస్తోందని స్పష్టం చేశారు.కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీశారని మండిపడ్డారు.వెనుకబడ్డ జిల్లాను మరింత వెనక్కి నెట్టారని వ్యాఖ్యానించారు.