మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
- హత్ సే హత్ జోడో యాత్రగా నామకరణం
- జనవరి 26,గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభం
- రాహుల్ గాంధీ లేఖతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ
- స్థానిక, ప్రాంతీయ భాషల్లో
తెలంగాణ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీ నుంచి హత్ సే హత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీ ఇంటికి చేరుకొని,రాహుల్ గాంధీ రాసిన లేఖలను అందజేస్తారు.ఈ విషయాన్ని జైరాం రమేష్ ప్రకటించారు.భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ మరో యాత్రకు సిద్ధమవుతోంది.వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో ప్రజల్లో తన పాత స్థానాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.అందులో భాగంగానే ఈ గణతంత్ర దినోత్సవం నుండి హత్ సే హత్ జోడో యాత్ర ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాసిన లేఖతో కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు ఇంటింటికీ వెళ్లి ఆయన ఆలోచనలను ప్రచారం చేస్తారని పార్టీ తెలిపింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకటించారు.ఈ హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ప్రతీ పంచాయతీ,ప్రతి బ్లాక్,ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిపారు.“ మేము జనవరి 26 నుండి హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము.ఇందులో మేము రాహుల్ గాంధీ లేఖతో ఇంటింటికీ వెళ్లి ప్రతీ పంచాయతీకి,గ్రామంలోని ప్రతీ బ్లాక్‌కు వెళ్తాం.మోడీ ప్రభుత్వంపై చార్జిషీటు కూడా తెస్తాం’’ అని రమేష్ అన్నారు.ఈ హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా భారత్ జోడో యాత్ర అనుభవాలను రాహుల్ గాంధీ ఓటర్లతో పంచుకుంటారని కాంగ్రెస్ పేర్కొంది.అయితే కాంగ్రెస్ చీఫ్‌గా మల్లికారుజున్ ఖర్గే నిర్వహించిన తొలి సమావేశంలోనే భారత్ జోడో యాత్ర పూర్తయిన తరువాత మరో యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.హత్ సే హత్ జోడో యాత్ర కింద ప్రతీ రాష్ట్ర రాజధానిలో మహిళా యాత్ర,పాదయాత్ర కూడా జరుగుతాయి.ఇవే కాకుండా ఫిబ్రవరి రెండో వారంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.జనవరి 30న కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియనుంది.ఈ కార్యక్రమం ముగింపులో సందర్భంగా రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తారు.భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్ లో కొనసాగుతుంది.కాంగ్రెస్ నాయకుడు చౌదరి సంతోఖ్ సింగ్ ఈ యాత్రలో గుండెపోటుతో మరణించారు.ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఒక రోజు ఈ యాత్రను నిలిపివేశారు.ఈ పాదయాత్ర ఇప్పటివరకు తమిళనాడు,కేరళ, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లను పూర్తి చేసి ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది. భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడూ కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది.