ఐఏఎస్,ఐపీఎస్ కేటాయింపుల పై నేడు
-సోమేశ్‌కుమార్‌పై తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ
- డీజీపీ కేటాయింపుపైనా పిటిషన్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 12 మంది అఖిలభారత సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్‌లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్,జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టనుంది.రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన కేటాయింపులను సవాలు చేస్తూ 11 మంది ఐఏఎస్‌లు,నలుగురు ఐపీఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు.మార్గదర్శకాలు సరిగాలేవంటూ వాటిని రద్దు చేస్తూ 2016లో క్యాట్ తీర్పు ఇచ్చింది.దీనిని సవాలు చేస్తూ కేంద్రంతో పాటు,పలువురు అధికారులు 2017లో హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.వీరిలో ఇద్దరు ఐపీఎస్‌లు గత ఏడాది పిటిషన్‌లను ఉపసంహరించుకున్నారు. గత వారం సోమేశ్‌కుమార్ కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులిస్తూ క్యాట్ తీర్పును రద్దు చేసింది. అధికారుల కేటాయింపు బాధ్యత కేంద్రానిదేనని,సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని తీర్పు వెలువరించింది.మిగిలిన అధికారులకు చెందిన వివాదంపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.వీటిలో ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్‌పై పిటిషన్ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది.సోమేశ్‌కుమార్‌కు ఇచ్చిన తీర్పు మిగిలిన వారికి వర్తిస్తుందన్న వాదన ఉన్నప్పటికీ ఆ కేసుతో తమ కేసులకు పోలిక లేదని,తమ అభ్యంతరాలను వినాల్సి ఉందని పిటిషనర్లు కోరనున్నారు.సీనియారిటీ జాబితాపై దాఖలైన పిటిషన్లపైనా హైకోర్టు విచారణ చేపట్టనుంది.