స్వరం పెంచిన పొంగులేటి Ponguleti Srinivas Reddy
- మణుగూరు మండలం తోగ్గూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన
- వేదికపై విల్లు ఎక్కుపెడుతున్న శ్రీనివాసరెడ్డి
- నేడు మంత్రులు హరీశ్, అజయ్ రాక
- నేతలు జారిపోకుండా ముమ్మర యత్నాలు
ఖమ్మం : ఖమ్మం వేదికగా భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు పార్టీపై అసమ్మతి గళం వినిపించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. మణుగూరు మండలం తోగ్గూడెంలో జరిగిన పినపాక నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సొంత పార్టీపై విమర్శలకు పదునుపెట్టారు. నాలుగేళ్లుగా అధినేతతో తండ్రీకొడుకుల బంధంగా వ్యవహరించినా తనకు దక్కిందేంటని వ్యాఖ్యానించారు.జనవరి 1 తర్వాత చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఉమ్మడి జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి సమావేశంలో తన ప్రస్తావన రావడంతో పార్టీ, అధినేత పేరు ప్రస్తావించకుండానే పొంగులేటి అసమ్మతి స్వరాన్ని పెంచారు.
కేసీఆర్ పిలుపుతో పార్టీలో చేరిన తనకు ఏ గౌరవం దక్కిందో కార్యకర్తలకు తెలుసని వ్యాఖ్యానించారు. కచ్చితంగా రాజకీయం చేసి తీరతానంటూనే ప్రజల ఆశీర్వాదం కోసం ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్తానంటూ ప్రకటించారు. పొంగులేటి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.తాజా పరిణామాలు, పొంగులేటి వ్యవహార శైలిని భారాస అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. పార్టీ పేరు ప్రస్తావించకుండా తిరుగుబావుటా ఎగురవేస్తుండటం,ఫ్లెక్సీల్లో అధినేత ఫొటోలు లేకుండా సమావేశాలు నిర్వహిస్తుండటంపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
పొంగులేటి మంగళవారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు అధినేత వద్దకు చేరాయని తెలిసింది.రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలనైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారాస అధిష్ఠానం సమాయత్తమవుతోంది. మాజీ ఎంపీ పొంగులేటితో పార్టీ నేతలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ముఖ్యనేతలను రంగంలోకి దించింది.ప్రస్తుతం కీలకమైన పదవిలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడితో మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు మంతనాలు సాగించినట్లు తెలిసింది.పార్టీ ఇచ్చిన గౌరవం గుర్తుంచుకొని తిరుగుబావుటా ఎగురవేసిన నాయకులతో వెళ్లొద్దని సూచించినట్లు సమాచారం.ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించడంతోపాటు భారాస ఆవిర్భావ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సభ నిర్వహణ,ఇతర పనులను పరిశీలించడంతో పాటు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఖమ్మం రానున్నారు.ఉదయం పది గంటలకు ఖమ్మం నగరంలోని రవాణా శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించే సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.అనంతరం సమీకృత కలెక్టరేటు వద్ద ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణ పనులను పరిశీలిస్తారు.సమావేశంలో నియోజకవర్గ బాధ్యులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.