తుది దశలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు నాలుగు గంటల పాటు తిరిగారు.మెయిన్ ఎంట్రన్స్,ల్యాండ్ స్కెప్ ఏరియా,పోర్టికో,అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం,గ్రానైట్ ఫ్లోరింగ్,మార్బుల్ ఫ్లోరింగ్,ఫాల్స్ సీలింగ్,జీఆర్సీ పనులు,కోర్ట్ యార్డ్ ల్యాండ్ స్కేప్ పనులు,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ వైస్ పనులను పరిశీలించారు.అధికారులకు వర్క్ ఏజెన్సీకి మంత్రి పలు సూచనలు చేశారు.నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని,పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను,అధికారులను ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి తెలియజేశారు.చారిత్రాత్మక కట్టడమైన ఈ పరిపాలన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా సెక్రటేరియట్ తుది దశ పనుల్లో మనసు పెట్టి పనిచేయాలని అధికారులకు,వర్క్ ఏజెన్సీకి మంత్రి సూచించారు.
కేజీబీవీ నాన్ టీచింగ్,వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల : జగిత్యాల పట్టణంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది,కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేజీబీవీ బోధనేతర సిబ్బంది,కార్మిక సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ జి. రవికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవస్థాపక అధ్యక్షురాలు గొర్రె లస్మక్క మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గతంలో కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ప్రకటించడం జరిగినదని గుర్తు చేశారు.ఈ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలో పనిచేస్తున్న బోధనేతర,కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సుప్రీంకోర్టు,హైకోర్టు తీర్పులకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు.కేజీబీవీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనీ,ఏఎన్ఎం లా సమస్యలను పరిష్కరించాలని,వేతనాలను పెంచాలని,విధి నిర్వహణలో చనిపోయిన బోధనేతర,కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.త్వరలో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్ అసోసియేషన్(ఐ.ఎఫ్.టి.యు) అనుబంధంతో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ బోధనేతర, కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గొర్రె లస్మక్క,గౌరవ సలహాదారు అక్షిత చౌదరి, అంజలి,కళావతి,స్వరూప,పుష్పలత,రాజవ్వ,సఫియా,అనుమవ్వ,నవిత,రేవతి తదితరులు పాల్గొన్నారు.