ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర
కొత్తగూడెం kothagudem : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడంలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసిందని విమర్శించారు. తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్ర ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు.ఈడీ నోటీసులతో ఎమ్మెల్సీ కవిత బెదిరిపోరని ఎన్ని వేధింపులకు గురిచేసిన ప్రజా క్షేత్రాన్ని వదలరని ఆయన అన్నారు. దేశాన్ని వడ్డికి పావుసేరు లెక్క అమ్మెస్తూ అదానికి లక్షల కోట్ల లబ్ది చేకూర్చుతూ ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న మోడీకి, అమిత్ షా కు ఈడి, సిబిఐ ఎందుకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే వనమా ప్రశ్నించారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని వేధిస్తూ వారి వేధింపులను ప్రశ్నిస్తున్న కవితని టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన అన్నారు. తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న దాడిగా ఇది పరగణించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం మీద మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందన్నారు. కేసీఆర్ ఆ నిధుల కోసం పోరాడుతూనే అలాగే దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీపై ఒంటరిగా గళమెత్తుతున్నారన్నారు. కేసీఆర్ కు దేశ వ్యాప్త మద్ధతు లభించడంతోనే రాజకీయ కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థల ద్వారా నోటీసులు ఇస్తున్నారని చెప్పారు.