ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త
* 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం
* ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున
* ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ
హైదరాబాద్ Hyderabad : తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మరో ముఖ్యమైన పథకం డబుల్ బెడ్రూం పథకం రాష్ట్రంలో ఇంతకు ముందు ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు నిర్మించి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది.
గతంలో శాసనసభలో ఆమోదం పొందిన విధంగా సొంత జాగా ఉన్న వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమానికి ‘గృహలక్ష్మి’ పథకంగా నామకరణం చేయడం జరిగింది. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. అంతే కాకుండా 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో పెట్టాలని నిర్ణయించాం. నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కోరారు ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించాం. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.3లక్షలు గ్రాంట్‌గా ఇవ్వాలని నిర్ణయించాం.
ఈ రూ.3లక్షలను మూడు దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గృహలక్ష్మి పథకంలో 4లక్షల ఇండ్లను మంజూరు చేస్తూ గొప్ప నిర్ణయాన్ని సీఎం కేసీఆర్, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించుకున్నాం.
మంజూరు చేసే ఇండ్లన్నీ ఆ ఇంటికి సంబంధించిన ఇల్లాలిపైనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవి.గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు రూ.4వేలకోట్లు పేదలపై అప్పులుంటే.. ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.గతంలో పేదల వర్గాలు కట్టుకున్న ఇండ్లను మాఫీ చేయడమే కాదు ఇవాళ ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తుండగా 4లక్షల ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు.