మోసం చేసిన ప్రియుడు సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
చెన్నై Chennai : ఇప్పటివరకూ తమ ప్రేమని అంగీకరించలేదనో లేక మోసం చేశారనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడమో ఇతర అఘాయిత్యాలకు పాల్పడటమో చూశాం.కానీ తాజాగా అందుకు భిన్నంగా ఓ అబ్బాయిపై ఒక అమ్మాయి ఎటాక్ చేసిన ఘటన వెలుగు చూసింది.తనని మోసం చేశాడన్న కోపంతో తన ప్రియుడి పై ఓ యువతి సలసల కాగే నూనె పోసింది దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఈరోడ్‌కి చెందిన మీనాదేవి, కార్తి రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే కొంతకాలం నుంచి కార్తిలో మార్పు రావడాన్ని మీనా గమనించింది.పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా అతడు మాట దాటవేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే విషయం మీనాదేవికి తెలిసింది.ఈ విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న మీనాదేవి ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పథకం రచించింది.ప్లాన్ ప్రకారం శనివారం మాట్లాడాలని ఉందని కార్తిని తన రూమ్‌కి పిలిచింది.ప్రియురాలి పిలుపు మేరకు కార్తి ఆమె రూమ్‌కి వెళ్లాడు అప్పటికే అతనిపై దాడి చేసేందుకు ఆమె నూనెని వేడి చేసి పెట్టింది. ప్రియుడు రూమ్‌కి రాగానే అదును చూసి,అతనిపై సలసల కాగే ఆ నూనెని పోసేసింది.అనంతరం ‘‘ఇప్పుడు నిన్ను ఎవరు ప్రేమిస్తారో నేను చూస్తా’’ అంటూ గట్టిగా అరిచింది.
ఈ ఘటనలో కార్తికి తీవ్ర గాయాలయ్యాయి ముఖం చేతులు కాలిపోయాయి.సహాయం కోసం అతడు కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు మీనా రూమ్ వద్దకు వచ్చారు.తీవ్ర గాయాలతో పడి ఉన్న కార్తిని చూసి అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.కార్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో మీనా దేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుడు కార్తి పెరుందురైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు.కార్తి,మీనాదేవి దగ్గరి బంధువులే అవుతారు.ఆ బంధుత్వంతోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం అది ప్రేమగా మారడం జరిగింది.అయితే సుఖాంతంగా ముగుస్తుందని అనుకున్న ఈ ప్రేమకథ, కార్తి మోసం చేయడంతో విషాదాంతంగా మారింది.