ఒక నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
హాజరుకానున్న 9.47 లక్షల మంది
హైదరాబాద్: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలి. ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు పరీక్షకు అనుమతిస్తారు. కచ్చితంగా ప్రశ్నపత్రాన్ని 9 గంటలకు ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు స్పష్టంచేసింది.
చూసుకోకపోతే కష్టాలు తప్పవు
ఓఎంఆర్ పత్రం ఇవ్వగానే అందులో పేరు, సబ్జెక్టు తదితర అంశాలను సరిచూసుకోవాలి. జవాబుపత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఒక రోజు ముందుగా ముఖ్యంగా నగరాల్లో పరీక్ష కేంద్రాలను చూసుకొని రావడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల విద్యార్థులు అయోమయానికి గురై ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకొని నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఒత్తిడికి గురికాకుండా రాయండి: సబిత
ఇంటర్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలకు పిల్లలు సకాలంలో చేరేలా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలు ఈనెల 15న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.మొత్తం 9,47,699 మంది హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఈనెల 29వ తేదీతో ముగుస్తాయి. 2021, 2022లలో 70 శాతం సిలబస్‌తో పరీక్షలు జరగగా రెండేళ్ల తర్వాత 100 శాతం సిలబస్‌తోపాటు గతంలో మాదిరిగా ఈసారి పరీక్షలు జరగనున్నాయి.