సినీ నటుడు శరత్‌బాబు ఇక లేరు
హైదరాబాద్ Hyderabad News : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్‌బాబు మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియాలో సంతాపం తెలిపారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడే శరత్‌బాబు. చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆయన అనుకోకుండా నాటకరంగం వైపు వచ్చారు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్‌బాబు 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా తొలి అడుగు వేశారు.
రెండో సినిమా కోసం విలన్ పాత్ర పోషించి హీరోగానే కాకుండా విలన్, సహాయనటుడిగా సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించారాయాన. ‘మరో చరిత్ర’, ‘గుప్పెడు మనసు’, ‘శృంగార రాముడు’, ‘ఇది కథ కాదు’, ‘47 రోజులు’, ‘సీతాకోక చిలుక’, ‘సితార’, ‘అన్వేషణ’, ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘క్రిమినల్’, ‘అన్నయ్య’ ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శరత్‌బాబు సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ రాణించారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’ ధారావాహిక ఆయన్ని బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే శరత్‌బాబు నటి రమాప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా వివాహమైన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.