పంచాయతీ కార్యదర్శులకు..విధుల్లో చేరకపోతే తొలగింపే
* జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు
* సమ్మెను కొనసాగిస్తాం జేపీఎస్‌ల రాష్ట్ర సంఘం
హైదరాబాద్ Hyderabad News : రాష్ట్రంలో గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసింది. లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు ఇచ్చారు. ‘‘ప్రభుత్వంతో ఒప్పందం బాండ్‌ను ఉల్లంఘిస్తూ సంఘం (యూనియన్)గా ఏర్పడి, సర్వీసు క్రమబద్ధీకరణ డిమాండ్‌తో ఈ ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. జేపీఎస్‌గా సంఘాలు, యూనియన్‌లలో చేరను అని ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రభుత్వానికి బాండ్ రాసి సంతకం చేశారు. దాని ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదు. అయినప్పటికీ ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు. చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు వెళ్లారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జేపీఎస్‌లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి చివరి అవకాశాన్ని ఇస్తోంది. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధులకు హాజరవ్వాలి. అలాచేరని వారిని ప్రభుత్వం ఉద్యోగాల్లోంచి తొలగిస్తుంది.’’ అని సుల్తానియా తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
న్యాయబద్ధమైన సమస్యల సాధనకు సమ్మెను కొనసాగిస్తామని రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం సోమవారం తెలిపింది. ప్రభుత్వం ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించినా జేపీఎస్‌లు అంతా ఏకతాటిపై నడిచి సమ్మెలోనే ఉండాలని నిర్ణయించారని వెల్లడించింది. ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామంది. తమ సమ్మెకు అందరి మద్దతు ఉందని పేర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరికలు మాని, తమను క్రమబద్ధీకరించి, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని సంఘం కోరింది.