తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం?
* కర్ణాటక ప్రభావంతో ఇక్కడా అమలుకు యోచన
* సాధ్యాఅసాధ్యాలపై సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం
* మహిళా ప్రయాణికులపై అధ్యయనం షురూ!
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరిన్ని జనాకర్షక పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న అసతృప్తిని దూరం చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన హామీలు ప్రధాన కారణం కావడం.. ముఖ్యంగా అక్కడి మహిళలకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ బాగా పనిచేసినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఈ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది.అక్కడ ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఈనెల 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.
అక్కడ ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.అయితే ఇదేతరహా పథకాన్ని తెలంగాణలోనూ అక్కడికంటే ముందుగానే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వెంటనే సర్వే చేపట్టి నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.
తెలంగాణలో ప్రతిరోజు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా ఇందులో సగానికి పైగా మహిళలుంటారు. పల్లె వెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్, మెట్రో, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య, అందులో మహిళా ప్రయాణికుల సంఖ్య.. తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.సర్వే నివేదిక అందాక ముఖ్యమంత్రి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా సంస్థకు రోజుకు రూ.2 కోట్ల నష్టాలు వస్తున్నాయి. రోజురోజుకూ ఈ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ పెండింగులో ఉన్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైతే ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయి.
మద్దతు లేకుంటే గెలుపు కష్టమే!
రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రత్యేకంగా చేయించిన అనేక సర్వేల్లో స్పష్టమైంది. పార్టీకి చెందిన పులువురు సిటింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండనే ఉంది. అవినీతి,భూకబ్జాలు లాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనేకమంది ఉన్నారు.ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ పస్తావిస్తూ.. పద్ధతి మార్చుకోకుంటే ఈసారి సీటు దక్కదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు లేకుంటే మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే అధికారంలో ఉన్నందున ఇప్పటినుంచే మరిన్ని జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. బీసీలకు రూ.లక్ష రుణం పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. ఈ పథకంతో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గానికి మరింత దగ్గర కావచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.