పోలీస్ స్టేషన్ లో నవ దంపతులపై దాడి
* ఓ కుటుంబం నూతన దంపతులపై దాడి
* కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు వారు అంగీకరించలేదు
* కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని
గద్వాలJadwala News భారత్ ప్రతినిథి : కూతురు ప్రేమ వివాహం చేసుకున్నదన్న ఆగ్రహంతో ఓ కుటుంబం నవ దంపతులపై పోలీస్ స్టేషన్ లోనే దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన ప్రశాంత్, పూడూరు గ్రామానికి చెందిన శిరీష గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. తమకు వివాహం చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులను అడగడం. కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు వారు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 8వ తేదీన ఈ జంట కర్నూల్ కి వెళ్లి ఓర్వకల్లు దేవాలయం వద్ద వివాహం చేసుకున్నారు.
అమ్మాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న జంట తాము మేజర్లమని, ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉంది అని తెలియజేసేందుకు గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన దంపతులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టేషన్ లో పోలీసులు ఉన్నప్పటికినీ అమ్మాయి తరపు బంధువులు నూతన దంపతులపై దాడికి పాల్పడ్డారు.
అమ్మాయి తాళి తెంపేందుకు ప్రయత్నాలు చేశారు. పరిస్థితి విషమించడంతో ఆ జంట వారి నుంచి తప్పించుకొని బయటపడి రోడ్డుపై ఎస్పీ కార్యాలయానికి పరుగులు పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు మోటార్ సైకిల్ పై ఎస్పీ కార్యాలయానికి చేర్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన ఎస్పీ వెంటనే అమ్మాయి తరపు వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. జంటపై దాడులకు పాల్పడితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని పోలీసులు అమ్మాయి తరపు వారికి నచ్చజెప్పి పంపించారు.