ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు
* రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు
* అగ్నిమాపక యంత్రాలు
* ప్రయాణికులు తీవ్ర ఆందోళలు
* మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాప్తి
యాదాద్రి Yadhadri News భారత్ ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించి లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నిలిపివేశారు. భయాందోళనలతో ప్రయాణికులంతా కిందికి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించాయి. ఇప్పటి వరకు 4 బోగీలు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది బోగీల మధ్య లింక్‌ను వేరు చేసి, రైలును ముందుకు తీసుకెళ్లారు.
అగ్నిమాపక యంత్రాలు అక్కడి చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఇప్పటివరకు మంటలు ఆర్పే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. స్థానిక పోలీసులు, ఆర్డీవో అక్కడి చేరుకున్నారు. మరోవైపు రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సంఘటన స్థలికి బయల్దేరారు. సంఘటన స్థలం నుంచి ఆర్డీవో భూపాల్‌రెడ్డి రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులతో సంప్రందింపులు జరుపుతున్నారు. బోగీల లింక్‌ను తప్పించం వల్ల మిగతా బోగీలకు మంటలు అంటుకునే అవకాశం లేదని ఆయన అన్నారు.మరోవైపు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ సామగ్రి అంతా కాలిబూడిదైపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని, తన సర్టిఫికెట్లన్నీ రైలులో ఉండిపోయాయని ఓ యువతి కన్నీరుమున్నీరైంది.