మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చకొడితే వారిపై కేసు
* సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా
* ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి
* ఎన్నికలప్పుడు ఇలాంటి పోస్టులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి
* ‘ది సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్’(స్మాష్)
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శ్రుతి మించి వివాదాలకు దారితీస్తోంది. లేనివాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి. భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పెడుతున్న పోస్టులు పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటివాటికి కళ్లెం వేసేందుకు జిల్లాలవారీగా ఉన్న సోషల్ మీడియా ల్యాబ్‌లను పటిష్ఠపరిచేందుకు అధికారులు నడుం బిగించారు.
ఉన్నత స్థానాల్లో ఉన్న వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం, వారు అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఇటీవలి కాలంలో మామూలయింది. ఉదాహరణకు ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యువకుడు పెట్టిన పోస్టు మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వాటి కట్టడికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ‘ది సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్’(స్మాష్) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ఇద్దరిపై పీడీ చట్టం ప్రయోగించి జైలుకు పంపడంతోపాటు 13 కేసులు నమోదు చేశారు. గత ఏడాది అనుమానాస్పదంగా, అభ్యంతరకరంగా ఉన్న 1,16,431 పోస్టులను సోషల్ మీడియా ల్యాబ్‌లు విశ్లేషించాయి. వీటిలో చట్టవిరుద్ధంగా ఉన్న పోస్టులపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలప్పుడు ఇలాంటి పోస్టులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ల్యాబ్‌లలో తాత్కాలిక ప్రాతిపదికన అయినా సిబ్బంది సంఖ్యను పెంచాలని, దాంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చాలని అధికారులు భావిస్తున్నారు.