షాకింగ్...రక్షించాల్సిన పోలీసులు రాక్షసుల్లాయ్యారు
* అల్లరి మూకతోనే పోలీసులు
* పోలీసులే ఆ ముఠాకు అప్పగించారు
* మణిపూర్ బాధిత మహిళల వెల్లడి
* నగ్నంగా రోడ్డుపై నడిపించుకుంటూ
మణిపూర్ Manipur News భారత్ ప్రతినిధి : రెండు మాసాలుగా హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బుధవారం రాత్రి వెలుగు చూసిన ఒక వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగిలాయి. రాజకీయ పార్టీలు, నేతలే కాకుండా సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. కొంతమంది అల్లరి మూక కుకీ తెగకు చెందిన 20, 40 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు మహిళలను బి ఫైనమ్ గ్రామ సమీపంలో నగ్నంగా రోడ్డుపై నడిపించుకుంటూ సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వారిలో కొంతమంది ఆ ఇద్దరి శరీర భాగాలు అసభ్యంగా తడుముతూ బలవంతంగా నెట్టుకుంటూ తీసుకెళుతున్నారు. మే 4న ఈ ఘటన జరగగా, మే 18 న దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులే తమను ఆ దుండగులకు అప్పగించారని మణిపూర్ బాధిత మహిళల్లో ఒకరు ప్రముఖ ఛానల్ కు ఫోన్‌లో తెలిపారు. మా గ్రామంపై దాడి చేసిన అల్లరి మూకతోనే పోలీసులు కూడా ఉన్నారు. మమ్మల్ని ఇంటికి సమీపం నుంచి తీసుకెళ్లిన పోలీసులు కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డుపై ఆ అల్లరి మూక దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులే మమ్మల్ని వారికి అప్పగించారు.
తమిద్దరిలో చిన్నదైన మహిళపై పట్టపగలే దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మరో మహిళ తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని తమ గ్రామంపై దాడి జరగడంతో తామందరం ఆశ్రయం కోసం సమీపంలోని అడవుల్లోకి పారిపోయామని చెప్పారు. పోలీసులు తమను పోలీసు స్టేషన్‌కు తీసుకువస్తుండగా, స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో అల్లరి మూక అటకాయించి మమ్మల్ని లాక్కెళ్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తంగా అయిదుగురు ఆ గ్రూపులో వున్నారని చెప్పారు. యువ మహిళ తండ్రి, సోదరుడిని కూడా ఈ మూక చంపేసినట్లు ఆమె తెలిపారు. ఆ గ్రూపులో కొద్దిమందిని గుర్తు పట్టగలనని బాధిత మహిళ తెలిపారు. వారిలో ఒకరు తన సోదరుడి స్నేహితుడిగా తెలుసునని చెప్పారు.తమని ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి వీడియో వుందన్న విషయం కూడా తమకు తెలియదని బాధిత మహిళ తెలిపారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.
ఎఫ్‌ఐఆర్ నమోదు, ఇద్దరు అరెస్టు
ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.