తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి పై, రేపు అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చజరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రేపు సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న అంశంపై సర్వత్రా పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసేందుకు గవర్నర్ తమిళిసై దగ్గరకు ఫైల్‌ను పంపించారు. కానీ అక్కడ నుంచీ క్లియరెన్స్ రాలేదు. కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎస్‌కు గవర్నర్ లేఖ రాశారు.
ఇలా గవర్నర్-ప్రభుత్వం మధ్య ఫైటింగ్ నడుస్తోంది. రేపటిలోగా ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోతే పెండింగ్‌లో పడిపోయే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నడుస్తోంది. ఇంకోవైపు ఎన్నికల సమీపిస్తున్నతరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రత్యర్థులకు అవకాశాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆయా వర్గాలకు పథకాలు ప్రకటించారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.బీసీ, మైనారిటీలకు రూ.లక్ష సాయం.. ఇలా కొత్త కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆదివారం కూడా శాసనసభలో సీఎం కేసీఆర్ మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.