కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు
టెక్నాలజీ Technology News భారత్ ప్రతినిధి : యూపీఐ ఆధారిత ఏటీఎం (UPI ATM)లు కూడా వచ్చేస్తున్నాయి. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే యూపీఐతో ఏటీఎం నుంచి క్షణాల్లో డబ్బులు తీసుకోవచ్చు.దేశంలోని ఏటీఎంల్లో త్వరలోనే కార్డుల గొడవ వదిలిపోయే అవకాశం ఉంది. కార్డు లేకుండానే కేవలం ఫోన్ ద్వారా సొమ్మును విత్‌డ్రా చేసుకొనే రోజులొచ్చేస్తున్నాయి. ఈ దిశగా ముంబయిలో తొలి అడుగు పడింది. జపాన్‌కు చెందిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ దేశంలో తొలి యూపీఐ-ఏటీఎంను ప్రవేశపెట్టింది. ‘హిటాచీ మనీస్పాట్ ఏటీఎం’ పేరిట దీనిని ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 5న ముంబయిలో జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023’లో దీన్ని ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి దీన్ని రూపొందించినట్లు తెలిపింది. క్రమంగా వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇకపై ఫోన్‌లోని యూపీఐ యాప్‌ల సాయంతోనే ఏటీఎంలలో డబ్బులు తీసుకోవచ్చన్నమాట.విత్‌డ్రా ఎలా?యూపీఐ- ఏటీఎం UPI-ATMను ఉపయోగించడం చాలా తేలిక. పైగా సురక్షితమైంది కూడా’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ సుమిల్ వికంసే తెలిపారు. ఈ ఏటీఎం నుంచి డబ్బు ఎలా ఉపసంహరించుకోవచ్చో చూద్దాం.ఏటీఎంలో తెరపై ‘యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంచుకోవాలి. తెరపై వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.ఫోన్‌లో ఉన్న యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్ చేయాలి.మీ లావాదేవీని ధ్రువీకరిస్తూ యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి.ధ్రువీకరణ పూర్తయిన వెంటనే ఏటీఎం మెషీన్ నుంచి క్యాష్ బయటకు వచ్చేస్తుంది.మీ లావాదేవీ విజయవంతమైనట్లు యాప్‌లోనూ సందేశం వస్తుంది.కార్డ్‌లెస్ విత్‌డ్రా ఇప్పటికే ఉంది కదా?ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డు లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కొన్ని ఏటీఎంలలో కల్పిస్తున్నాయి. యూపీఐ- ఏటీఎం సైతం ఇలా కార్డు లేకుండానే డబ్బులు తీసుకునేందుకు ఒక మార్గం. అయితే, సాధారణ కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్‌లో అయితే, మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని ధ్రువపర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. కానీ, యూపీఐ ఏటీఎం అలా కాదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్వయంగా మీరు మీ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తేనే డబ్బులు బయటకు వస్తాయి. ఫోన్‌లో యూపీఐ యాప్ ఉన్న ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. హిటాచీ మనీస్పాట్ ఏటీఎం ఒక వైట్ లేబుల్ ఏటీఎం. అంటే దీన్ని బ్యాంకింగేతర సంస్థలు నిర్వహిస్తాయి.UPIలో ఉన్న సౌలభ్యం, భద్రతను సంప్రదాయ ఏటీఎంలలో సజావుగా ఏకీకృతం చేయడం.. బ్యాంకింగ్ సేవల్లో మరో మైలురాయిని సూచిస్తుంది. ఫిజికల్ కార్డ్ అవసరం లేకుండానే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నగదును పొందేలా ఈ వినూత్న విధానాన్ని తీసుకొచ్చాం’’ అని ఎన్‌పీసీఐ తెలిపింది.దేశంలో యూపీఐ (UPI) ఆధారిత లావాదేవీలు గత కొన్నేళ్లుగా భారీగా పుంజుకుంటున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో సగానికి పైగా వాటా వీటిదే. ఒకరకంగా చెప్పాలంటే ఈ యూపీఐ (UPI) వ్యవస్థ మొత్తం చెల్లింపుల విధానాన్నే సమూలంగా మార్చేసింది. ఈ ప్రయాణంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది.