నిపా వైరస్ లక్షణాలు.. చికిత్స ఏంటంటే?
National News భారత్ ప్రతినిధి : దేశాన్ని నిపా వైరస్ కలవరానికి గురి చేస్తున్నది. 1998లో మలేషియాలో తొలిసారిగా కనిపించిన వైరస్.. 2004లో బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది. అరుదైన, తీవ్ర ప్రాణాంతకమైన వైరస్ కాగా.. ఇప్పటికే కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిలో లక్షణాలు బయటపడ్డాయి.అయితే, ఇంతకు ముందు కేరళలో తొలిసారిగా 2018లో నిపా వైరస్‌ను గుర్తించగా.. 23 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత 2019, 2021లో వైరస్ కనిపించింది. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి లక్షణాలు కనిపించడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేరళలోని పలు గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పాఠశాలలను మూసివేశారు.
అసలు ఏంటీ నిపా వైరస్..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం.. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జునోటిక్ వ్యాధి. గబ్బిలాలు, పందుల నుంచి మనుషలకు సైతం సోకుతుంది. 1998లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు. సుంగాయ్‌లో నిపా అనే గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో ఈ వైరస్‌కు నిపా వైరస్‌గా నామకరణం చేశారు.ఈ వైరస్ కారణంగా మలేషియాలో 105 మంది మృతి చెందగా.. సింగపూర్‌లో పందుల పోషకులు సైతం మృతి చెందారు. 2004లో బంగ్లాదేశ్‌లోనూ వెలుగు చూసింది. ఆ తర్వాత భారత్‌తో పాటు పలుదేశాల్లోనూ బయటపడింది. అయితే, ఫ్రూట్ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్‌కు వాహకాలు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్ సోకుతుంది. 2004లో బంగ్లాదేశ్‌లో ఈ వైరస్ సోకిన గబ్బిలాలు తిన్న పండ్లను తినడంతోనే మనుషులకు సైతం సోకింది.
వైరస్ లక్షణాలు..
వైరస్ సోకిన వ్యక్తుల్లో దాదాపు 5 నుంచి 14రోజుల్లోగా వైరస్ లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుసుకోవడంలో ఇబ్బంది, తల తిరిగినట్లుగా ఉండడం, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితి తిప్పినట్లుగా అనిపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే, గాలి ద్వారా వైరస్ సోకదని, అప్పటికే వైరస్ సోకిన జంతువులు, మనుషులను నుంచి మాత్రమే వ్యాపిస్తుందని పేర్కొన్నారు. వైరస్ బారినపడినా చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, కొందరిలో మాత్రం ఎన్సెఫాలిటిస్ వస్తే నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. నిపావైరస్ మరణాల రేటు 40-75శాతం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో న్యుమోనియా, తీవ్రమైన శ్వాస సమస్యలుంటాయి. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో బాధిత వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. రక్షణ చర్యలు ఏంటీ..? ఫ్రూట్ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు నిపావ్యాప్తికి వాహకాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఆ గబ్బిలాలు కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కలుషిత ఆహారం తీసుకున్న సమయంల నేరుగా మనిషి నుంచి మనిషికి సైతం సోకుతుంది.ఇప్పటి వరకు నిపావైరస్‌కు ప్రస్తుతం ఎలాంటి మందులు అందుబాటులో లేవు. కేవలం నివారణ చర్యలు మాత్రమే పాటించాలి. వైరస్ సోకిన జంతువుల అవశేషాలను ముట్టుకోకుండా తగులబెట్టాలి. మృతదేహాలను కాల్చివేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.పండ్లు కూరగాయలను పరిశుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని తీసుకోవాలి. తినేముందు చేతులను శుభ్రంగా సబ్బుతో వాష్ చేసుకోవాలి. గబ్బిలాలు ఆహారంగా మామిడి పండ్లు, జాక్ ఫ్రూట్స్, రోజ్ ఆపిల్స్‌ను ఎక్కువగా తీసుకుంటాయి. వాటిని తినే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి