రేపే టెట్ పరీక్ష
* సర్వంసిద్ధం చేసిన విద్యాశాఖ
* 4,78,055 మంది అభ్యర్థులు
* 2,052 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
* పరీక్ష జరిగే స్కూళ్లు, కాలేజీలకు నేడు, రేపు సెలవు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌కు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారికోసం 1,139 పరీక్షా కేంద్రాలు, పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారి కోసం 913 పరీక్షా కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తామని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,052 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించామని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకున్నారని వివరించారు. వైద్యారోగ్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను మెడికల్ కిట్లతో
అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలకు అభ్యర్థులు సకాలంలో వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని వివరించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించామని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రెండు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్ వెంటతెచ్చుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బ్యాగులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆ విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవు టెట్ పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు, కాలేజీలకు గురు, శుక్రవారం రెండురోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. టెట్ నిర్వహించే విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే గురువారం మధ్యాహ్నం, శుక్రవారం రెండు పూటలా సెలవులుంటాయని స్పష్టం చేశారు. టెట్ నిర్వహించే జూనియర్ కాలేజీలకు గురు, శుక్రవారాల్లో సెలవులుంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం, శుక్రవారం రెండుపూటలా సెలవులుంటాయని పేర్కొన్నారు.టెట్ పరీక్ష వివరాలు...టెట్ నిర్వహణ తేదీ దరఖాస్తులు పరీక్షా కేంద్రాలు పేపర్-1 2,69,557 1,139 2023 సెప్టెంబర్ 15 పేపర్-2 2,08,498 913 మొత్తం 4,78,055 2,052