బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే!
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో అందరి చూపు బీఆర్ఎస్ మేనిఫెస్టోపైనే ఉంది. తెలంగాణ ప్రజలకు గులాబీ బాస్ ఇచ్చే హమీల గురించే అందరూ చర్చించుకుంటున్నారు.ఇదే నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మేనిఫెస్టోకి తుదిమెరుగులు దిద్దే పనిలో పడింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత హరీశ్ రావు ఎన్నికల్లో కీలకమైన ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. త్రిముఖ వ్యూహంలా .. ఈ ముగ్గురి చేతిలో రూపుదిద్దుకుంటున్న మేనిఫెస్టోను ఈ నెల 15న ప్రకటించే అవకాశం ఉంది.
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది.మేనిఫెస్టోలో కీలకంగా ఈ అంశాలపై చర్చిస్తున్నట్టు తెలిసింది. సంవత్సరానికి ఉచితంగా ఐదు సిలిండర్లు, రైతు బంధు రూ.12,500 నుంచి రూ. 15,000 లకు పెంపు, కల్యాణ లక్ష్మి లక్షా 20వేల నుంచి లక్షా 50 వేలకు పెంపు, పెన్షన్ మూడు వేలు చేసే యోచన, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు హెల్త్ ఇన్సురెన్స్‌ను తీసుకు వస్తున్నట్టు సమాచారం.
ఇవే గనుక అమలైతే దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఇది కచ్చింతగా చెక్ పెట్టే యోచనగానే దీన్ని భావించొచ్చు.కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. మరోవైపు టికెట్లు రాలేదని అలిగిన నేతల బుజ్జగింపులపైన కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎక్కడా వ్యతిరేకత కనిపించకుండా, అందరినీ కలుపుకుని పోయేలా చూడాలని సూచించనట్టుగా చెబుతున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారేలా మేనిఫెస్టో ఉండేలా చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించకముందే మేనిఫెస్టోతో జనంలోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.