సర్పంచుల పదవీ కాలం పూర్తి కానుంది
* కొత్త సర్కారు నిర్ణయంపై ఎదురుచూపు
* పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
* రిజర్వేషన్లపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
* ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీకాలం పూర్తి
* ఎన్నికలు ఇప్పుడా.. 'పార్లమెంటు' తర్వాతా ?
హైదరాబాద్ Hyderabad News : తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ముగియనుంది. అంటే మరో 55 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ పంపారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ సిస్టమ్ (పీపీఆర్‌ఎస్) సాప్ట్‌వేర్ అప్లికేషన్‌లో వివరాల నమోదు వంటి వాటిపై కలెక్టర్లకు ఆయన పలు సూచనలు చేశారు.
ఈ నెల 30లోపు ఈ కసరత్తు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది.
దీన్ని బట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో జరగకపోవచ్చని, మే, జూన్‌లో చేపట్టవచ్చన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్త సర్కారు తీసుకునే నిర్ణయం కోసం గ్రామీణ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. కాగా, రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో 6,117 సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ ఏర్పడినప్పటికీ బీఆర్‌ఎస్ సర్కారు ఉప ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. సర్పంచ్, ఎంపీటీసీల స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వంలోనైనా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని గ్రామీణులు డిమాండ్ చేస్తున్నారు.