తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్ల పాలన
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు గ్రామాల్లో అందరి దృష్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై పడింది. షెడ్యూలు ప్రకారం జనవరి 31తో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగుస్తున్నది.ఫిబ్రవరి 1 నుంచి కొత్త బాడీలు ఏర్పాటుకావాల్సి ఉన్నది. కానీ బీసీ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ఎన్నికలు మే నెల తర్వాత జరిగే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ప్రకారం రాష్ట్ర బీసీ కమిషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. దీంతో గత ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్ విధానానికి బదులుగా కొత్త లెక్కలు వేయాల్సి ఉన్నది.ఇప్పటివరకూ స్టేట్ బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వెళ్లకపోవడంతో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. ఆ నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనున్నది. రిజర్వేషన్ విషయంలో డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ లెక్క తేలిన
తర్వాత ప్రాసెస్ మొదలవుతుంది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది.స్థానిక ఎన్నికల నిర్వహణకు లోక్‌సభ ఎన్నికలతో చిక్కులు వచ్చే అవకాశమున్నది. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితర అధికారులు లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మార్చి నెలలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్నందున ఆ పనుల్లో బిజీ కానున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అప్పటివరకూ జరపడానికి ఆచరణాత్మక ఇబ్బందులు తలెత్తనున్నాయి.స్పెషల్ ఆఫీసర్ల పాలన నిర్దిష్ట డెడ్‌లైన్ ప్రకారం జనవరి 31తో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున ఆ తర్వాత వారు ఆ పదవుల్ల కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రజాప్రతినిధులు కొలువుదీరేంత వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. షెడ్యూలు ప్రకారం జూన్‌లో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు జరగనున్నందున అవి కూడా నెల రోజులు ఆలస్యమయ్యే చాన్స్ ఉన్నది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని కమిషన్ నిర్వహిస్తుంది.