పకడ్బందీగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు - ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ, సీఎంఓ కార్యదర్శి శ్రీ శేషాద్రి, విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేనలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.