రైతుబంధు అందేదెన్నడు?
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : యాసంగి పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ నెల 12 నుంచి రైతుల ఖాతాల్లో పాత పద్ధతిలోనే కొత్త ప్రభుత్వం ఈ నిధులను జమ చేస్తోంది. గతంలో పంట పెట్టుబడి వెంట వెంటనే రైతులు ఖాతాల్లో జమయ్యేది. ఇప్పుడు చాలామంది ఖాతాల్లో జమ చేయటంలో జాప్యం జరుగుతోంది. ఎకరం లోపు రైతులు జిల్లాలో మొత్తం 1,28,000 మంది ఉన్నారు. కానీ 95,802 మంది అన్నదాతల ఖాతాల్లో బుధవారం నాటికి రూ.24.78 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఎకరం లోపు ఇంకా చాలామంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాల్సి ఉంది. అనేక మంది పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో మొత్తం 3,29,892 మంది రైతుల ఖాతాల్లో రూ.362.92 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఎకరం లోపు రైతులు 1.28 లక్షల మంది, 2 ఎకరాల్లోపు 85 వేల మంది, పోడు రైతులు 11,511 మంది ఉన్నారు. ఈ సంవత్సరం కొత్త రైతులు 6,780 మందికి రైతుబంధు పథకం మంజూరు చేశారు. దీనిపై నిత్యం అనేక మంది కర్షకులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు. రైతుబంధు నిధులు యాసంగి సీజన్‌కు ఆదుకుంటాయని రైతులు భావిస్తున్నారు. ఆలస్యం కావడం వల్ల అసంతృప్తికి గురవుతున్నారు. డిసెంబరులో కొత్త ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని ప్రకటించింది. కౌలు రైతులు, ఇతర రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారం మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇంతవరకు వ్యవసాయశాఖ అధికారులకూ దీనిపై స్పష్టత లేదు.