టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో..న్యాయసలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఛైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్‌లో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా ఛైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశముంది.
అప్పుడే రాజీనామా కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయన్ను తొలగించడంతోపాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి భారాస ప్రభుత్వం తిరస్కరించింది.కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యం ప్రభుత్వం మారడంతో డిసెంబర్‌లో జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.