ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ!
* మగువలకు సర్కారు సంక్రాంతి కానుక.. పండగకు 4,484 ప్రత్యేక బస్సులు
* 626 బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే
*‘మహాలక్ష్మి’లో 7 కోట్ల మంది ఉచిత ప్రయాణం.. అధికారులతో సమీక్షలో ఎండీ సజ్జనార్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంక్రాంతి కానుక ఇవ్వాలని నిర్ణయించింది. పండగ సందర్భంగా టీఎ్‌సఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కూడా ‘మహాలక్ష్మి’ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. అంటే మహిళలకు ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణమే! ఇక పండగ రద్దీ దృష్ట్యా 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శుక్రవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పండగ సందర్భంగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి పండగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపూ ఉండదని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామని తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 7 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని సజ్జనార్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లోనే ఉచిత ప్రయాణం అమలు చేయడం వెనక ఆర్టీసీ సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. రాజేంద్రనగర్ డిపోలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.