జయశంకర్ వర్సిటి ఘటన... తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ వద్దకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనంపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టుకోవడంతో కింద పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆమె ఆరోగ్య పరిస్థితి సహా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.