వ్యవసాయశాఖ లెక్కలేనితనం రైతుబీమా పథకానికి జీఎస్టీ సెల్లింపులతో రూ.445 కోట్లు నష్టం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే బీమా పథకం తాలూకూ ప్రీమియం మొత్తాన్ని సర్కారు పద్దు నుంచి చెల్లించే పక్షంలో జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఉంటుందని 2017 జూన్‌లో జరిగిన జీఎస్టీ మండలి 16వ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ 2018 నుంచి అమలైన రైతుబీమా పథకానికి జీఎస్టీ కింద తెలంగాణ వ్యవసాయశాఖ ఏకంగా రూ.445 కోట్లు చెల్లించింది.తెలంగాణలో 2018 నుంచి 18-59 సంవత్సరాల మధ్య ఉన్న రైతులకు ప్రభుత్వం రూ.5 లక్షల రైతుబీమా పథకాన్ని అమలుచేసింది. ఈ పథకం కింద రైతుల ప్రీమియాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికోసం 2018 జూన్‌లో వ్యవసాయశాఖ కమిషనర్ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందులో భాగంగా 2018 జూన్ నుంచి 2021 సెప్టెంబరు వరకు మూడేళ్ల కాల వ్యవధిలో ప్రీమియం కింద వ్యవసాయశాఖ జీవిత బీమా సంస్థకు రూ.3,649 కోట్లు చెల్లించింది.
అందులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూ.445 కోట్లు కూడా ఉంది. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో జీఎస్టీ కింద మినహాయింపులు ఉన్నా వ్యవసాయశాఖ పట్టించుకోలేదు. 2018లో మొదటి ఏడాది ప్రీమియం కింద చెల్లించిన మొత్తంలో జీఎస్టీగా రూ.107.42 కోట్లు చెల్లించింది. 2019 జూన్‌లో వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీ సందర్భంగా ఈ అంశాన్ని కాగ్ గుర్తించి వ్యవసాయశాఖ దృష్టికి తీసుకొచ్చింది. అయినా ఏ మాత్రం పట్టించుకోని ఆ శాఖ అధికారులు ఆ తర్వాత రెండేళ్లపాటు (2021 వరకు) మరో రూ.337.61 కోట్లు చెల్లింపులు చేశారు. చివరికి 2021 జులై/ఆగస్టులో ఎల్‌ఐసీతో సంప్రదింపులు జరిపి 2021-22 సంవత్సరం నుంచి జీఎస్టీ మినహాయింపు పొందుతూ వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఐసీకి చేసిన చెల్లింపులను వెనక్కు తీసుకునే ప్రయత్నాలను కూడా వ్యవసాయశాఖ చేపట్టలేదని కాగ్ గుర్తించింది.