రూ.500కే గ్యాస్ సిలిండర్... డీలర్లుకు స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ
* తొలి విడత అమలు విరికే
* సర్వే పూర్తయ్యాక మరికొంతమందికి
* సీఎం ఆదేశాలతో అత్యవసర సమావేశం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గురువారం జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో ఈ పథకంపై గ్యాస్ డీలర్లతో చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో వెంటనే పౌరసరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.
ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించగా.. డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తంచేయడంతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు.డీలర్లకు అడ్వాన్సు చెల్లించే ప్రతిపాదన డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తామని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని తెలిపింది. డీలర్ల సంఘం నుంచి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి శ్రీచరణ్, ట్రెజరర్ ఐలారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌తో పాటు పదాధికారులు హాజరయ్యారు. ఓ జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి కూడా సమావేశంలో పాల్గొన్నారు.