వారం రోజుల్లో ఫ్రీ కరెంట్,రూ.500కే గ్యాస్ సిలిండర్ : సీఎం రేవంత్‌రెడ్డి
కోస్గి Kosgi News భారత్ ప్రతినిధి : వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టంచేశారు. పాలమూరు గడ్డ నన్ను ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని.. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగింది.
రాయలసీమను రతనాల సీమ చేసేందుకు కృష్ణా జలాల తరలింపునకు సహకరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారు. కరీంనగర్ నుంచి గెలవరనే ఆనాడు మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేశారు. వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపిస్తే.. తెలంగాణ వచ్చాక పాలమూరుకు ఏమీ చేయలేదు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఓటు అడగాలి. భాజపా, భారాస మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2014లో నరేంద్రమోదీ జిల్లాకు వచ్చి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లయిన ఎందుకు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నా. నలుగురు భాజపా ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలవాలి. మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు.