సబ్జా గింజల్లో లాభాలెన్నో..!
* పానీయం తాగితే ఒంట్లో వేడి పటాక్
* జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం
ఆరోగ్యం Health : సబ్జా గింజల గురించి చాలా మందికి పరిచయం అక్కర్లేదు. ఈ సబ్జా గింజల్లో ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో పలువురు ఆరోగ్య కారిణిగా తీసుకుంటారు.ఒంట్లో వేడి చేసిందంటే చాలు అప్పట్లో చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. అయితే క్రమంగా వాటిని అలా తాగేవారు తక్కువయ్యారు కానీ, ఆ పానీయం తాగితే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగితే ఇంకా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో సబ్జా గింజల వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.రోజంతా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను రాత్రి పూట పానీయం రూపంలో తాగితే దాంతో అధిక బరువు తగ్గిపోతుంది. స్థూలకాయులకు ఇది మేలు చేసే అంశం. అంతే కాదు, ఆ పానీయం సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు ఉంటే పోతాయి.సబ్జా గింజల పానీయాన్ని తాగితే శరీరంలో ఉన్న వేడి అంతా ఇట్టే హరించుకుపోతుంది. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే దాంతో మధుమేహం అదుపులోకి వస్తుంది.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం. తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి అనారోగ్యాలను పోగొట్టే సహాయకారిగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, చక్కెర వేసి తాగితే అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.గోరువెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి. నీటిలో వేయగానే జెల్ మాదిరిగా మారే సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యంత అవసరం.