రైతుబంధు ఏమాయే..?
* మళ్లీ పాతపద్ధతి షురూ.. అప్పులు తెచ్చి సాగుచేస్తున్న రైతులు
* మేడ్చల్ జిల్లాలో 48,072 మంది రైతులు
* రైతుబంధు పడింది..29వేల రైతులకే
* మిగతా రైతుల పరిస్థితి ఏమిటీ.?
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం మేడ్చల్, ఫిబ్రవరి 15 వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 ఎకరాల రైతులకు మాత్రమే రైతుబంధు నగదు జమ కాగా.. మిగతా రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది.జిల్లాలో మొత్తం 48,072 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 29వేల మంది రైతులకు మాత్రమే రైతుబంధు పడినట్లు సమాచారం.
అయితే మిగతా రైతులకు రైతుబంధు నగదు జమ కాకపోవడంతో వరి పంట విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 13,400 ఎకరాలలో సాగు చేసేందుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం విధితమే. అయితే ఇప్పటి వరకే వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా పంట పెట్టుబడి సాయం అందక ఇంకా నాట్లు పూర్తికాలేదని రైతులు పేర్కొంటున్నారు.గత యాసంగిలో రూ.36కోట్ల 67లక్షలు గత యాసంగిలో పంట పెట్టుబడి సాయం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 48,072 మంది రైతులకు రూ.36కోట్ల 67లక్షల నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో రైతుబంధు నగదు జమ కాని రైతులు ప్రతి రోజు ఫోన్‌లలో మెస్సేజ్ కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.