విధి కుక్కల దాడి శంషాబాద్ లో బాలుడి మృతి
Hyderabad News భారత్ ప్రతినిధి: శంషాబాద్ అమ్మ కావాలంటూ అర్ధరాత్రి లేచి బయటకు వచ్చిన బాలుడు వీధి కుక్కల దాడిలో మృత్యువాతపడిన హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన కోళ్ల సూర్యకుమార్‌యాదమ్మ దంపతులు కూలి పనుల నిమిత్తం శంషాబాద్‌కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు.
ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కాగా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున మరోసారి లేచి ఏడుస్తూ బయటకు రాగా వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాహనదారులు వాటిని తరిమివేసి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతిచెంది ఉన్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా ఒకరు అనారోగ్యంతో మరొకరు పుట్టిన ఏడు రోజులకు ప్రస్తుతం నాగరాజు శునకాల దాడిలో మృతిచెందడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.