గ్రామసభ తీర్మానాలనే అమలు చేయాలి ప్రత్యేకాధికారుల విధులపై ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : పంచాయతీరాజ్ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలని, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియగా ఎన్నికలు నిర్వహించే వరకు వారి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు రాష్ట్రంలోని 12,770 గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం వారి విధుల నిర్వహణపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రెండు మాసాలకోసారి విధిగా గ్రామ సభ నిర్వహించాలి.
గ్రామాల్లో అవసరమైన పనులకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాలను ఖర్చు చేయాలి. పంచాయతీ కార్యదర్శి, కార్మికుల పనులను పర్యవేక్షించాలి. ప్రత్యేకాధికారులు తమ బాధ్యతలు సమర్థంగా నిర్వహించేందుకుగాను గ్రామాలను తరచూ సందర్శించాలి. పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపైనా శ్రద్ధ చూపాలి. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆడిట్ నిర్వహించాలి,అని ప్రభుత్వం ప్రత్యేకాధికారులకు నిర్దేశించింది. ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకుగాను గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్యదర్శులు స్థానికంగా నివసించాలని సూచించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకాధికారులు పంచాయతీల్లో బాధ్యతలు చేపట్టారు.