సర్పంచుల పదవి కలం పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలన్న సర్పంచుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తున్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ జనగామ, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సర్పంచులు విజయ, వేణుగోపాల్, అనిల్‌కుమార్, మురళీధర్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.శరత్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పంచాయతీల పాలకవర్గాల గడువు ముగుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగంలోని పలు అధికరణలతోపాటు పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమన్నారు. కిషన్‌సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వహించకుండా ప్రభుత్వానికి లోబడి ఉంటోందని ఆరోపించారు. పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందు ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి.. కనీసం ఓటర్ల జాబితానైనా సిద్ధం చేసి ఉండాల్సిందన్నారు. పంచాయతీల బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగిస్తోందని.. అలాకాకుండా ఎన్నికలు జరిగేదాకా ప్రస్తుతం ఉన్న సర్పంచులనే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలన్న అభ్యర్థనను తిరస్కరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆయా జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.