చేతిలో చేరికలకు బ్రేక్..!
* మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆలస్యం
* ఆయన కోసం వెనక్కి తగ్గిన వర్గీయులు
* చేరబోతున్న నేతలపై అందరి ఆసక్తి
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జోష్ ఏర్పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీల నేతల చేరికలు జోరందుకున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా నుంచి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు కుమారుడు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అందరి దృష్టి మాత్రం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి చేరికపైనే పడింది. ప్రస్తుతం ఆయన చేరిక మరింత ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.పార్టీ పిరాయింపుల చట్టం నేపథ్యంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చేరిక నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి ఢిల్లీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మంత్రి మహేందర్ రెడ్డి చేరిక తరువాత తాండూరు నియోజకవర్గంలోని ఆయన వర్గీయులు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది.నిజానికి జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి చేరిక సమయంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉందని, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిర్ణయం మేరకు చేరికలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీతో పాటు ఆయన వర్గంలోని నేతలు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి పనిచేసారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీతో నేతలు బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.