ముగిసిన సర్పంచుల పదవీకాలం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మెదక్ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక పాలన అందుబాటులోకి రానుంది సర్పంచుల పదవీకాలం గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించారు.ముందుగా ఆయా శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించగా గజిటెడ్ హోదా ఉన్న వారిని మాత్రమే నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దీంతో వారి నియామకం ఆలస్యమైంది.
గురువారం సాయంత్రం ఆయా మండలాల్లోని పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ అదనపు పాలనాధికారి రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 21 మండలాల్లో 469 పంచాయతీలకు గజిటెడ్ హోదా ఉన్న ఎంపీడీవో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ నీటిపారుదల పంచాయతీరాజ్ మిషన్‌భగీరథ శాఖలకు చెందిన ఏఈలు మండల వ్యవసాయశాఖ అధికారులు ఎంపీవోలు మండల గణాంకశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులను ప్రత్యేకాధికారులగా నియమించారు. వీరు సర్పంచులు విధులను నిర్వహించనున్నారు. గ్రామకార్యదర్శి ప్రత్యేకాధికారి పేరిట సంయుక్త చెక్‌పవర్ ఇవ్వనున్నారు. ప్రత్యేకాధికారులు శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఏఏ బాధ్యతలు నిర్వహించాలనే విషయమై 3వ తేదీన దూరదృశ్య సమీక్ష ద్వారా వివరించనున్నారు.