వడగాలులతో విల విల 8 జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రమంతటా సగటున 41.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల ప్రజలు వేడితో ఠారెత్తిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మునుగోడు, వేములపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఖమ్మం కనకన మండుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న వేడి శనివారం మరింత తీవ్రస్థాయికి చేరింది. గడిచిన పదేళ్లలో లేనంతగా సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదైంది.36.7 డిగ్రీలకు బదులుగా 42.8 డిగ్రీల ఎండ కాస్తుండటంతో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీవాడకు చెందిన దూడ కిష్టయ్య(72) శనివారం వడదెబ్బతో మృతిచెందారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. రాష్ట్రమంతటా ‘ఆరెంజ్’ రంగు(40-45 డిగ్రీల మధ్య) హెచ్చరికలను విడుదల చేసింది.