జోగిపేటలో దారుణం... బాలుడిని చంపి ఉరివేసుకున్నా రౌడీషీటర్
జోగిపేట Jogipet News భారత్ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ బాలుడిని చంపిన రౌడీషీటర్ సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు కేబుల్ వైర్లు చోరీ చేశాడు. దొంగతనం విషయం చెప్పాడని శేఖర్ (13) అనే బాలుడిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి మాట్లాడాలని చెప్పి బాలుడిని తీసుకెళ్లి చంపేశాడు. మృతదేహం కనిపించకుండా బావిలో పడేశారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని నిన్న రాత్రి ఓ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు.
దీంతో రౌడీషీటర్ నాగరాజును అరెస్టు చేసేందుకు ఆదివారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లగా.. భయపడి సెల్‌టవర్ ఎక్కాడు. చోరీ విషయంలో తన పేరు చెప్పినందుకు బాలుడిని చంపేసి బావిలో పడేసినట్టు చెప్పాడు. పోలీసులు బావిలో నుంచి బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు. బాలుడి బంధువులు పెద్ద ఎత్తున సెల్‌టవర్ వద్దకు చేరుకోవడంతో దాడి చేస్తారేమోనని భయపడి సెల్ టవర్ వైర్లతో అక్కడే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయి. వ్యాపారులు, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.