ఫెయిర్నెస్ క్రీమ్ లతో కీడ్నీలకు హాని
* వాటిలోని పాదరసంతో ప్రభావం
* తాజా అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యం Health : మీ చర్మ సౌందర్యం కోసం ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నారా? టీవీల్లో కనిపించే ప్రకటనలు చూసి ఆకర్షితులై ఆ క్రీమ్‌లను ట్రై చేస్తున్నారా? అయితే ఇలాంటి క్రీమ్‌ల వాడకం వల్ల భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటిలో ఉండే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నట్టుగా పేర్కొంది. చర్మం నిగారింపు కోసం ఫెయిర్‌నెస్ క్రీముల వాడకం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా భారత మార్కెట్ వీటికి లాభదాయకమైనదిగా మారిపోయింది.అయితే ఈ క్రీమ్‌ల వాడకం వల్ల కిడ్నీలకు హాని కలుగుతుందనడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయన వివరాలను కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. అధిక పాదరసం ఉన్న క్రీమ్‌ల వాడకం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతి (ఎంఎన్) కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీయడమేకాకుండా ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందని అధ్యయనం పేర్కొంది.
ఎంఎన్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది మూత్రంలో ఎక్కువ ప్రొటీన్ విసర్జించేలా చేస్తుంది. 2021 జూలై నుంచి 2023 సెప్టెంబరు మధ్య కాలంలో నమోదైన 22 ఎంఎన్ కేసులను ఈ అధ్యయనంలో భాగంగా పరీక్షించారు. చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి మూత్రపిండాల ఫిల్టర్లను ప్రభావితం చేస్తుందని, ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకుల్లో ఒకరైన ఆస్టర్ ఎంఐఎంఎస్ హాస్పిటల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ డాక్టర్ సజీష్ శివదాస్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో ఈ క్రీమ్‌లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ క్రీములు త్వరగా ప్రభావం చూపుతాయన్న ప్రచారం వల్ల చాలా మంది ఆకర్షితులవుతున్నారని తెలిపారు.