గ్రూప్- 1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. జూన్ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులను ఉదయం 9గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. పది గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1న మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది.