రైతులకు గుడ్ న్యూస్... ఎన్నికల కోడ్ తరువాత ఎకరాకి..15 వేలు
* నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్
* బీమా కంపెనీలకు కాదు.. రైతులకు మేలు జరిగేలా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. ఆరు గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి.ప్రస్తుతం రైతు బంధు కింద ఐదు ఎకరాల్లోపు రైతులకు ఎకరానికి రూ.10వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలినవారికి లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జమ చేయనున్నారు. వచ్చే వర్షాకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట వేసుకున్న రైతులకే వీటిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ రైతుల నుంచి కౌలు రైతులు అఫిడవిట్లు తీసుకోవాలని, అలా తీసుకున్న వారికే భరోసా నిధులు అందుతాయన్నారు. రైతు భరోసాపై అఖిలపక్షంతోపాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాన్ని తీసుకోబోతున్నట్లు చెప్పారు. శాసనసభలో దీనిపై చర్చ జరుగుతుందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని, గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని కూడా సరిగా చేయలేదని మంత్రి తుమ్మల విమర్శించారు.
నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రూ.2 లక్షల్లోపు పంట రుణాలపై వాస్తవ లెక్కలను ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించినట్లు తుమ్మల వెల్లడించారు. బీమా కంపెనీలకు కాదు రైతులకు మేలు జరిగేలా కోడ్ ముగిసిన తర్వాత కటాఫ్ తేదీపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు అకాల వర్షాలు, వరదలవల్ల, కరవు వల్ల పంటలు నష్టపోయినవారిని ఆదుకునేలా పంటల బీమా పథకం ఉంటుందని, పంట వేయలేని పరిస్థితి ఉన్నా, దిగుబడులు తగ్గినా సాయం అందుతుందన్నారు. ఈ పథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు చేయడానికి సిద్ధమయ్యామన్నారు. బీమా కంపెనీలకు కాకుండా రైతులకు మేలు జరిగేలా తమ ప్రభుత్వ విధివిధానాలు ఉంటాయని స్పష్టంచేశారు.