ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా... దిల్లీ సర్కార్ నిర్ణయం
దిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. నీటి వృథాపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం దిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు.మే 30న ఉదయం 8గంటల నుంచి ఈ బృందాల్ని రంగంలోకి దించేలా చర్యలు చేపట్టాలని దిల్లీ జల్‌బోర్డు సీఈవోకు రాసిన లేఖలో అతిశీ పేర్కొన్నారు. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. హరియాణా నుంచి తమకు రావాల్సిన నీటి వాటా కోసం ఆప్ సర్కార్ పోట్లాడుతోంది. ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని మంత్రి అతిశీ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోవడంపై దృష్టిసారించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.