పీఎం - కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాలోకి రూ..20 వేల కోట్లు
వారణాసి Varanasi News భారత్ ప్రతినిధి : రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ సమ్మాన్‌నిధి17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన. పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీనికింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తోంది.