పుస్తకాలే లేవు అప్పుడే పరీక్షలు ఫీజులు
తెలంగాణ Telangana News : దూరవిద్యా విధానంలో అర్హులైన వారికి డిగ్రీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రొఫెసర్ రాంరెడ్డి దూరవిద్య కేంద్రం విద్యార్థులకు బోధన అందించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. దూరవిద్యా విధానంలో అర్హులైన వారికి డిగ్రీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రొఫెసర్ రాంరెడ్డి దూరవిద్య కేంద్రం విద్యార్థులకు బోధన అందించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. గతేడాది ప్రారంభమైన సెమిస్టర్ విధానంలో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇంకా పుస్తకాలు, స్టడీమెటీరియల్ పూర్తిగా అందకముందే పరీక్షలు నిర్వహిస్తామంటూ తేదీలు ప్రకటించింది.
ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను హెచ్చరించింది ఇంతేకాదు కళాశాలల్లో చదివే విద్యార్థులకు బోధన తరహాలో క్లాసులకు హాజరు కావాలంటూ తాఖీదులు జారీచేసింది. సెలవురోజుల్లో, ఆదివారాల్లో తరగతులుంటాయని చేరితే వర్సిటీలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లా ఎలా వెళ్తామని దూరవిద్య విభాగం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వేర్వేరు సంస్థలు, కార్యాలయాల్లో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నామని, దూరవిద్య కేంద్రం ఆచార్యులు చెప్పినట్లు నడుచుకోవాలంటే తీవ్ర ఇబ్బందులుంటాయంటున్నారు.
అరకొరగా పుస్తకాల సరఫరా : పీజీస్థాయిలో ప్రతి కోర్సుకు 16 సబ్జెక్టులుండగా సెమిస్టర్ ప్రారంభమై ఏడాది పూర్తవుతున్నా రెండు, మూడు పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. వాటితో జులైలో జరుగనున్న పరీక్షలు ఎలా రాస్తారో అధికారులకే తెలియాలి. సైకాలజీ సబ్జెక్టు చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పటివరకూ ఒక్క పుస్తకం కూడా అందలేదట. ఈనెల 28 వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జులై 5లోపు రూ.1720 ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుం రూ.500తో వచ్చేనెల 12 లోపు కట్టాలంటూ అధికారులు ప్రకటించారు. విద్యార్థుల ఇబ్బందులను జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ డీబీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని, పరీక్షల ఫీజు చెల్లించమంటూ ముందుగా ప్రకటన ఇవ్వడం సాధారణమేనని వివరించారు.