3 కిలోల బంగారంతో మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ పరార్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కస్టమర్ల నెత్తిపై మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ టోపీ పెట్టాడు. వారు తాకట్టు పెట్టిన 3 కిలోల బంగారంతో ఉడాయించాడు. వికారాబాద్ జిల్లా అలంపల్లిలోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో ఇటీవల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి అలంపల్లి బ్రాంచిలో 7 తులాల బంగారం పెట్టి రూ.3.30 లక్షల లోన్ తీసుకున్నాడు. ఇటీవల డబ్బు చెల్లించి బంగారం తీసుకునేందుకు మణప్పురం ఆఫీసుకు వెళ్లగా బ్రాంచ్ మేనేజర్ విశాల్ ‘‘రేపు రండి. సర్వర్ డౌన్ ఉంది’ అని రాజేందర్‌రెడ్డిని తిప్పి పంపాడు.
కొన్ని రోజుల పాటు ఇలానే సమాధానం చెప్పాడు. ఎక్కడో తేడా కనిపిస్తున్నదని రాజేందర్ కు అనుమానం వచ్చి బ్యాంకు సిబ్బందిని నీలదీశాడు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. అప్పటికే బ్రాంచ్ మేనేజర్ విశాల్3 కిలోల బంగారంతో పరారైనట్లు తెలిసింది. దీంతో వినియోగదారులు శనివారం ఆఫీసుకు వెళ్లారు.
తాము తాకట్టు పెట్టిన బంగారానికి సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ లీగల్ సెల్ ఇన్ చార్జి శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 3 కిలోలు ఉన్న 60 బంగారం ప్యాకెట్లతో మేనేజర్ విశాల్ పారిపోయాడని చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి బంగారానికి పూర్తి బాధ్యతను తామే తీసుకుంటామన్నారు. 15 రోజుల్లో గోల్డ్ లేదా అమౌంట్ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.