కేసీఆర్ వల్ల ప్రాణహిత చేవెళ్లలో 750 కోట్ల నష్టం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంచనాలు పెంచాల్సి వచ్చిందని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌కు రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘2016 మార్చి 1న మూడు బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు రూపొందించారు. మేడిగడ్డ బ్యారేజీకి తొలుత రూ.2,591 కోట్ల అంచనాలు రూపొందించగా, దాన్ని రూ.4,613 కోట్లకు పెంచారు. అన్నారం బ్యారేజీ అంచనాలను రూ.1,785 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు సవరించారు.
సుందిళ్ల బ్యారేజీ అంచనాలను రూ.1,437 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచారు” అని వివరించారు.కాళేశ్వరం అవకతవకలపై ఓపెన్ కోర్టు విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ శుక్రవారం రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లును విచారించింది. అసలు అంచనాలను ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ‘‘బ్యారేజీలో పెద్ద పనులకు సీఈ సీడీవో ఆమోదం తెలపడం, ఫ్లడ్ బ్యాంక్స్, డైవర్షన్చానెళ్లను తర్వాత చేర్చడం, పన్నుల్లో మార్పులు రావడం తదితర కారణాలతో అంచనాలు పెంచారు. ఇది ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే జరిగింది” అని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు.
ప్రాణహిత చేవెళ్లలో నష్టం రూ.750 కోట్లు....
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2014 వరకు రూ.14 వేల కోట్లు ఖర్చు పెట్టారని వెంకటేశ్వర్లు తెలిపారు. అందులో రూ.750 కోట్లే నష్టం జరిగిందన్నారు. 3 బ్యారేజీల పనులు ఎప్పుడు మొదలయ్యాయని ప్రశ్నించగా 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లకు అప్పటి సీఎం భూమి పూజ చేశారని చెప్పారు. నిర్మాణ సంస్థలు బ్యారేజీలను పూర్తి చేసేందుకు గడువును పొడిగించాలని కోరాయా అని ప్రశ్నించగా బ్యారేజీల నిర్మాణానికి గడువు మరీ తక్కువగా ఉండడంతో ఏజెన్సీలు గడువును పెంచాలని కోరాయన్నారు. 3 బ్యారేజీలకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చారా అని ప్రశ్నించగా మేడిగడ్డ కాంట్రాక్ట్ సంస్థకు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్, అన్నారం, సుందిళ్లను నిర్మించిన సంస్థలకు కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్‌కు అగ్రిమెంట్లో క్లాజ్‌ను కూడా చేర్చారన్నారు.